‘‘రిషబ్ పంత్ ఎక్కడ, ఎక్కడ అని అడిగారు కదా... ఇదిగో నెంబర్ 4 స్థానంలో ఉన్నాడు చూశారుగా’’ అంటూ టీం ఇండియా వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. పేర్కొన్నారు.

ప్రపంచకప్ 2019 లో తొలిసారి టీం ఇండియా ఓటమి చవిచూసింది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. మ్యాచ్ ఓటమి అనంతరం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో... నెంబర్ 4 స్థానంలో రిషబ్ పంత్ ని బ్యాటింగ్ కి దించడంపై రోహిత్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి.

తొలుత వరల్డ్ కప్ కి జట్టుని ఎంపిక చేసిన సమయంలో పంత్ ని సెలక్టర్లు పక్కన పెట్టారు.దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పంత్ ని ఎందుకు తీసుకోలేదని అభిమానులు, మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా స్థానంలో నెంబర్ 4వ బ్యట్స్ మెన్ గా పంత్ కి అవకాశం ఇచ్చారు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదే ప్రశ్నని మ్యాచ్ అనంతరం మీడియా ప్రతినిధులు రోహిత్ ముందు ఉంచారు. పంత్ కి ఆ స్థానం ఇవ్వడం మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందా అని అడిగారు.  దీనికి సమాధానంగా రోహిత్ ‘‘ నేనేమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. మీరంతా పంత్ వరల్డ్ కప్ లో ఆడాలని అనుకున్నారు కదా? పంత్ ఎక్కడ, పంత్ ఎక్కడ అని అడిగారు కదా. ఇప్పుడు చూశారుగా. నెంబర్ 4లో ఉన్నాడు’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు.

అయితే... రోహిత్ చెప్పిన సమాధానం వెటకారంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో పంత్ ఆశించినంతగా రాణించలేదు. దీంతో అందుకే పంత్ ని ముందు సెలక్ట్ చేయలేదని.. కానీ అభిమానులు కావాలని కోరుకున్నారని అనే అర్థం వచ్చేలా రోహిత్ మాట్లాడినట్లు పలువురు భావిస్తున్నారు.