న్యూఢిల్లీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా ఓడిపోవడంతో రవీంద్ర జడేజా ఏడ్చేశాడని ఆయన భార్య రివాబా అన్నారు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ద్వారా టీమిండియాను విజయం అంచు దాకా తెచ్చాడు.జట్టు స్వల్ప తేడాతో పరాజయం పాలు కావడంతో జడేజాను ఓదార్చలేక పోయామని అతడి భార్య రివాబా తెలిపింది.

92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన స్థితిలో ధోనీ అండగా జడేజా మరిచిపోలేని ఇన్నింగ్స్‌ ఆడాడు. 59 బంతుల్లో 77 పరుగులు చేసి టీమ్‌ను గెలుపు ముంగిట నిలబెట్టాడు. కానీ, హెన్రీ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడే క్రమంలో జడేజా అవుటయ్యాడు. 

ఆ తర్వాత భారత్‌ లక్ష్య ఛేదనలో విఫలమై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో జడేజా గుండె పగిలిందని అతడి భార్య రివాబా చెప్పింది. "జడ్డూను ఓదార్చలేకపోయాం. నేను అవుట్‌ కాకుండా ఉండుంటే తప్పకుండా గెలిచే వాళ్లమని పదేపదే చెబుతూ ఎంతో బాధపడ్డాడు" అని రివాబా తెలిపింది.

జడేజా జర్నీని చూస్తే కీలకమైన మ్యాచుల్లో అతను ఎలా వికెట్లు తీశాడో, ఎలా పరుగులు చేశాడో అర్థమవుతుందని ఆమె అన్నది. 2013 ఇండియా చాంపియన్స్ ట్రోఫీ విజయంలో జడేజా పోషించిన పాత్రను ఆమె గుర్తు చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శన ద్వారా ఫైనల్ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడని ఆమె చెప్పింది.