మాంచెస్టర్: న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీని చివరలో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించడానికి గల కారణంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చారు. అది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయమని ఆయన అన్నారు. ధోనీని కాస్తా ముందుగా బ్యాటింగ్ కు పంపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు. 

న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 240 పరుగుల అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ అపోసాపాలు పడుతున్న స్థితిలో రిషబ్ పంత్, దినేష్ కార్తిక్, హార్డిక్ పాండ్యాల తర్వాత ధోనీ బ్యాటింగ్ కు దిగాడు. రవీంద్ర జడేజాతో కలిసి ధోనీ వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీ రన్నవుటయ్యాడు. 

ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించాలనేది టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయమని, ప్రతి ఒక్కరూ దానికే మద్దతు ఇచ్చారని, ధోనీని ముందు పంపిస్తే అతను అవుటైతే లక్ష్య ఛేదన కష్టమవుతుందనే బావనతో ఆ పని చేశామని ఆయన ఓ ఇంగ్లీష్ మీడియా ప్రతినిధితో అన్నారు. 

చివరలో ధోనీ అనుభవం అవసరమవుతుందని, అన్ని వేళల్లోనూ గ్రేటెస్ట్ ఫినిషర్ గా నిలిచాడని, ఆ తరహాలో అతన్ని వాడుకోకపోతే నేరమవుతుందని రవిశాస్త్రి అన్నారు. జట్టు మొత్తం ఆ విషయంలో స్పష్టతతో ఉందని చెప్పారు.