టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై గత కొద్దికాలంగా విమర్శలు ఎక్కువయ్యాయి. ధోనీ సరిగా ఆడలేకపోతున్నాడని.. పరుగులు తీయలేకపోతున్నాడని... అతని కారణంగానే ఇటీవల ఇంగ్లాండ్ తో టీం ఇండియా ఓటమి పాలయ్యిందంటూ పలువురు విమర్శించారు. నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ మ్యాచ్ లో సైతం టీం ఇండియా ఇంకా ఎక్కువ స్కోరు చేసే స్కోప్ ఉన్నప్పటికీ ధోనీ కారణంగానే చేయలేకపోయిందని సీనియర్లు సైతం విమర్శలు గుప్పించారు. కాగా...ఈ విమర్శలకు ధోనీ అభిమానులు సమాధానం చెప్పారు. 

ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ధోనీ బొటనవేలికి గాయమైంది. అయినప్పటికీ ఆ బాధని దిగమింగి మరీ బ్యాటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోని చూసి ఆ తర్వాత ధోనీపై విమర్శలు చేయండి అంటూ సవాలు విసురుతున్నారు.

ఆ ఫోటోలో ధోని తన బొటనవేలిని నోట్లు పెట్టుకోవడం.. మరో ఫోటోలో రక్తం ఉమ్మివేయడం ఉన్నాయి. దీనిని బట్టి ధోనీ బొటనవేలికి పెద్ద దెబ్బే తగిలిందని అర్థమౌతోంది. అయినా ఎవరీతో చెప్పకుండా ధోనీ తన ఆటను కొనసాగించాడు. నొప్పి భరించి దేశం కోసం ఆటఆడాడంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోనీపై విమర్శలు చేసేవారందరికీ ఈ ఫోటోనే సమాధానం చెబుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.