ప్రస్తుత క్రికెట్ లో నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. ప్రస్తుతం జరుగుతన్న వన్డే ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు సెమిస్ ఆశలను చేజార్జుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ స్పందించారు. పాక్ జట్టు సెమిస్ కి చేరులేకపోవడానికి ఎవరూ బాధ్యులు కాదని అన్నాడు. 

‘‘వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్‌తో మాకు తీవ్ర నష్టం జరిగింది. తర్వాత శ్రీలంకపై జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మావాళ్లు ఆస్ట్రేలియాపై ఓడిపోయారు. ఈ మూడు మ్యాచ్‌లు పాకిస్తాన్‌ కష్టాలకు కారణమయ్యాయి. దీంతో తనంత తానే పాకిస్తాన్ ఈ టోర్నమెంటు నుంచి వైదొలగాల్సి వస్తోంది. దీనికి ఎవర్నీ బాధ్యుల్ని చేయలేం..’’ అని పేర్కొన్నాడు.

అనంతరం ఓవరాల్ ప్రపంచకప్ గురించి మాట్లాడారు. క్రికెటర్లకు పరుగులు తీయడం మంచినీరు తాగినంత సులభంగా మారిందన్నారు.  1990, 2000ల కాలంలో అంత సులభంగా ఉండేది కాదన్నారు. నాణ్యత తగ్గిపోవడం వల్లే ఇప్పుడు క్రికెటర్లు సులభంగా  పరుగులు తీస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్ జట్టు చేతిలో న్యూజిలాండ్ చిత్తు ఓడిపోవడంపై షోయబ్ మండిపడ్డాడు. చెత్తగా ఆడి పోయారని విమర్శించారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయి ఉంటే... పాక్ కి సెమిస్ కి వెళ్లే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు.