వరల్డ్ కప్ లో ఫేవరేట్స్ తో సంబంధం లేకుండా... ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ లలో భారత్-పాక్ మ్యాచ్ ముందు ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే... ఎప్పటి లాగా ఈ సారి కూడా టీం ఇండియానే విజయం సాధించింది. 

మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. 89 పరుగుల తేడాతో పాక్‌ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో చిత్తుగా ఓడించేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టు విజయానికి సహకరించారు. అయితే... టీం ఇండియా గెలిచినందుకు ఇండియన్స్ సంబరాలు చేసుకుంటుంటే... పాక్ ఫ్యాన్స్ మాత్రం తమ కెప్టెన్ సర్ఫరాజ్ ని విపరీతంగా ట్రోల్ చేశారు. అక్కడితో ఆగకుండా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కశ్మీర్ విషయంలో భారత్-పాక్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ మ్యాచ్ లో పాక్ ఓటమికి కశ్మీర్ తో ముడిపెట్టారు. తమకు కశ్మీర్ అవసరం లేదని... కేవలం టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తమకు ఇచ్చేయమంటూ... పాకిస్తాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేయడం విశేషం. కోహ్లీని సింహంతో, సర్ఫరాజ్ ని హైనాతో పోలుస్తూ.. సోషల్ మీడియాలో మెసేజ్ లు చేయడం విశేషం. తమకు కశ్మీర్ అవసరం లేదని.. కేవలం విరాట్ కోహ్లీని ఇవ్వండి చాలు అంటూ.. కొందరు పాకిస్థానీలు షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టంట వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఈ మ్యాచ్ తో మరింత పెరిగిపోయిందంటూ కోహ్లీ అభిమానులు సంబరపడుతున్నారు.