దాయాదుల పోరులో భాగంగా భారత్ చేతిలో ఘోర పరాజయం పాలవ్వడంతో పాక్ జట్టు స్వదేశంలో తీవ్ర విమర్శల పాలైంది. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి పాకిస్తాన్ జట్టు విమర్శలకు జవాబిచ్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పాక్ విజయం సాధించడం ద్వారా కొంతమందితోనైనా నోర్లు మూయించామన్నాడు.

తనకు ఏదైతే తెలుసో అదే మా ఆటగాళ్లు ఆడతారు. వారు తిరిగి గాడిలో పడటంతో రాణించారు.. గత వారం టీమిండితో ఓటమి కారుణంగా వారిపై అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విజయంతో ప్రస్తుతం కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా అని ఆర్ధర్ అభిప్రాయపడ్డాడు. ఈ విజయంతో ప్రపంచకప్ మెగా టోర్నీలో పాక్ ఇంకా కొనసాగుతోంది. సెమీస్ చేరేందుకు మిగతా మ్యాచ్‌లని సైతం గెలుస్తామని ఆర్ధర్ ధీమా వ్యక్తం చేశాడు.

రాబోయే మ్యాచ్‌లలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లను ఓడిస్తామని మిక్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మిగిలిన అన్ని జట్లలాగే తమ జట్టు బలంగా ఉందన్నాడు.

పాకిస్తాన్ ‌బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడవడంపై దృష్టిసారిస్తామని చెప్పాడు. ఈ సందర్భంగా పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సోహైల్ ను ఆర్ధర్ మెచ్చుకున్నాడు.