ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ని చీటర్ అంటూ... ఇటీవల ఇండియన్ అభిమానులు గేలి చేసిన విషయం తెలిసిందే. దీనిని గమనించిన టీం ఇండియా కెప్టెన్... వెంటనే అభిమానులను వారించారు. అలా చేయద్దని మైదానంలోనే సూచించారు. అంతేకాదు... స్మిత్ ని అభిమానించాలంటూ చప్పట్లు కూడా కొట్టారు. మైదానంలో కోహ్లీ క్రీడా స్ఫూర్తి కి అందరూ ఫిదా అయ్యారు. అతను చేసింది గొప్ప పని అని అందరూ అభివర్ణించారు. అయితే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నిక్ కాంప్టన్ మాత్రం కోహ్లీ చేసిన దానిని తప్పుపట్టాడు.

 ‘వార్నర్‌, స్మిత్‌లను భారత అభిమానులు తిట్టకుండా ఆపే హక్కు కోహ్లికి ఉందా? వారు తప్పు చేసారు కాబట్టే అభిమానులు అంటున్నారు’ అని అభిప్రాయపడ్డాడు. కాగా... అతను చేసిన కామెంట్స్ అతనికే రివర్స్ అయ్యాయి. కోహ్లీని తప్పు పట్టినదందుకు కాంప్టన్ ని నెటిజన్లు ట్రోల్ చేశారు.

నెటిజన్ల ట్రోల్స్ చూసాక తాను కోహ్లీని కామెంట్ చేయడం తప్పు అన్న విషయం కాంప్టన్ కి అర్థమయ్యింది. వెంటనే అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘కోహ్లి పట్ల నేను చేసిన అనాలోచిత వ్యాఖ్యలకు ఎవరైన బాధపడి ఉంటే క్షమించండి. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. కోహ్లి చేసిన పని గొప్పది. వీటన్నిటిని పక్కనపెట్టి  క్రికెట్‌ను ఆస్వాదించండి. మీ అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు.

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ సందర్భంగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ను ట్యాంపరింగ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ ‘చీటర్‌, చీటర్‌’ అంటూ అభిమానులు గేలి చేశారు. దీనిని గమనించిన కోహ్లీ.. వెంటనే తన సైగలతో అభిమానులను వారించి.. తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం కూడా ఈ విషయంపై కోహ్లీ మాట్లాడారు. భారత అభిమానుల తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు.