న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోనీకి అత్యంత గౌరవమిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. రోహిత్ శర్మ కొత్తగా ధోనీకి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ మేరకు వారిద్దరు ట్వట్టర్ లో తమ సందేశాలను పోస్టు చేశారు.  

ధోనీ ఆదివారం తన 38వ పుట్టినరోజు  జరుపుకున్నాడు. ధోనీకి పెద్ద యెత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. టీమిడియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ధోనీకి శుభాకాంక్షలు చెప్పాడు. తన దృష్టిలో ఎప్పటికీ ధోనీనే కెప్టెన్ అని విరాట్ కోహ్లీ అన్నాడు.
 
"హ్యాపీ బర్త్ డే మహీ భాయ్. గౌరవం, విశ్వాసానికి అర్థం చాలా కొంతమందికే తెలుస్తుంది. ఇన్నేళ్లుగా నీలాంటి వ్యక్తితో స్నేహం చేయడం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా అందరికీ నువ్వు పెద్దన్న లాంటి వాడివి. గతంలో చెప్పినట్టుగానే.. ఎప్పుటికీ నువ్వే నా కెప్టెన్‌వి" అని కోహ్లీ ట్వీట్ చేశాడు. 

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం వినూత్నంగా ధోనీకి శుభాకాంక్షలు చెప్పాడు. "ఎవరక్కడ.. కేక్ తీసుకొని రండి. పుట్టిన రోజు సందర్భంగా నీకు నా బెస్ట్ విషెస్" అని అతను విషెస్ చెప్పాడు.