క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పై టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకు సచిన్ చేసిన కామెంట్సే కారణం.

ఇంతకీ మ్యాటరేంటంటే...ప్రపంచకప్ లో భాగంగా శనివారం టీం ఇండియా ఆఫ్గానిస్తాన్ తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీం ఇండియా అతి కష్టం మీద గెలుపొందింది. తృటిలో ఓటమిని తప్పించుకుంది. కాగా ఈ మ్యాచ్ పై సచిన్ స్పందించాడు. 

.‘ ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. ధోని, కేదార్‌ జాదవ్‌ల భాగస్వామ్యం పట్ల కూడా నేను సంతోషంగా లేను. వారిద్దరు చాలా నెమ్మదిగా ఆడారు. 34 ఓవర్లకు కేవలం 119 పరుగులే చేశాం. అప్పటి నుంచే మనం వెనుకబడ్డాం. సీనియర్‌ ఆటగాడు అయి ఉండి ధోని కూడా పాజిటివ్‌గా కనిపించలేదు’ అని సచిన్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు.

ధోనీపై చేసిన కామెంట్స్ కి అతని ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. సచిన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  ‘సచిన్‌ కంటే ధోనీనే ఎన్నో రెట్లు గొప్ప ఆటగాడు.  ఎన్నో ప్రపంచకప్‌లు ఆడినా ధోనీ వచ్చేదాకా ఒక్కటీ గెలవలేదు. మేటి ఆటగాళ్లంతా ఉన్నా సచిన్‌కు సాధ్యం కానిది ధోని అతడికి కానుకగా ఇచ్చాడు’ అంటూ సచిన్ కి కౌంటర్లు ఇస్తున్నారు. 

అంతేకాకుండా ధోనీ, సచిన్ ఇద్దరి జీవితాలపై బాలీవుడ్ లో సినిమాలు విడుదలవ్వగా.. ధోనీ సినిమాకి జనంతో నిండిన థియేటర్ ఫోటో, సచిన్ సినిమాకి ఖాళీ థియేటర్ ఫోటోలను పెట్టి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.