ప్రపంచకప్ టీం ఇండియా విజయ పరంపర కొనసాగుతోంది.  ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా.. అన్నింటిలోనూ విజయం సాధించిన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా...  గురువారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు క్రికెటర్ కాట్రెల్ కి టీం ఇండియా క్రికెటర్ షమీ.. కౌంటర్ ఇచ్చారు. కాగా... ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరల్డ్ కప్ టోర్నమెంటులో విండీస్ పేసర్ కాట్రెల్ తన ప్రదర్శనతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. వికెట్ తీసిన ప్రతిసారి అతడు మార్చింగ్, సెల్యూట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అతడు జమైకా ఆర్మీలో ఆరునెలల పాటు శిక్షణ తీసుకున్న నేపథ్యంలో... సైన్యానికి గౌరవ సూచకంగా ఈ విధానాన్ని ఎంచుకున్నాడు. 

అయితే నిన్న ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కాట్రెల్‌కు ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. మహ్మద్ షమీని డకౌట్ చేసిన ఆనందంలో సెల్యూట్ చేసిన కాట్రెల్‌కి... షమీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. తొలుత ఇండియా బ్యాటింగ్ చేసిన తర్వాత లక్ష్య చేధనలో భాగంగా విండీస్ జట్టు బరిలోకి దిగింది. అయితే వికెట్లను కాపాడుకోలేక పోయింది.

తన వికెట్ తీసినప్పుడు కాట్రెల్ ఏవిధంగా సెల్యూట్ చేశాడో... అచ్చం అదేవిధంగా కాట్రెల్ ని వికెట్ తీసిన ఆనందంలో షమీ కూడా సేమ్ ఫోజ్ ఇచ్చాడు. షమీ వేసిన ఈ కౌంటర్‌పై భారత క్రికెట్ అభిమానులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అతడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇలా చేయడం అతడి దేశాన్ని అవమానించడమేనంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం కాట్రెల్ మార్చ్‌ని అనుకరిస్తూ కనిపించాడు.