మాంచెస్టర్ వేదికగా నేడు జరగనున్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కి వర్షం నుంచి ముప్పు తప్పింది. ప్రపంచకప్ లో భాగంగా సెమిస్ కి చేరిన ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ లో తలపడుతున్నాయి. వాస్తవానికి నిన్నటితో మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉండగా... వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే...రివ్యూ డే పేరిట ఈ రోజు మళ్లీ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో మ్యాచ్ జరగనుంది.

అయితే... వాతావరణ పరిస్థితులు చూస్తే.. ఈరోజు కూడా వర్షం పడేలా ఉందని అందరూ భావించారు. దీంతో ఈ మ్యాచ్ లో విజయం ఎవరి సొంతం అవుతుందా అని అందరూ కంగారు పడ్డారు. అయితే.. ఇప్పుడు వర్షం ముప్పు తప్పినట్లే తెలుస్తోంది.

ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న ఆకాశం ప్రస్తుతం నల్లని మబ్బులు తొలగి మ్యాచ్‌కు అనుకూలంగా మారింది. గూగుల్ వెదర్ కూడా వర్షం పడటానికి ఛాన్స్ లేదని రిపోర్ట్ చేసింది. అయితే.. ఆద్యంతం వాతావరణం ఇదే విధంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. మాంచెస్టర్‌లో ఉదయం కూడా చిన్నపాటి జల్లులు కురిశాయి. ఇంగ్లండ్ కాలమానం ప్రకారం వర్షం లేకపోతే ఉదయం 10.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.