ప్రపంచకప్ లో భాగంగా ఇటీవల భారత్-పాక్ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ల్ పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా... ఈ మ్యాచ్ లో భారత్ విజయం అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాక్ పై భారత్ విజయం సాక్షిగా ఓ ప్రేమ జంట తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసింది.

ప్రేక్షకుల గ్యాలరీలో ఓ యువకుడు తన ప్రేయసికి పెళ్లి ప్రపోజల్ చేశాడు. తన ప్రేమను తెలియజేస్తూ ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. గ్యాలరీలో కూర్చున్న అన్వితా అనే యువతికి తన ప్రియుడు విక్కీ ఉంగరాన్ని చూపించి‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆమె అతడికి ‘ఒకే’ చెప్పడమే కాకుండా గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. 

అక్కడే ఉన్న వారి స్నేహితులు ‘వెల్ డన్ విక్కీ’ అంటూ మరింత ఉత్సాహపరిచారు. ఉత్కంఠగా సాగుతున్న మ్యాచ్‌లో ఈ సన్నివేశాన్ని చూసిన గ్యాలరీలోనియ ఇతర అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఈ వీడియోను అన్వితానే స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.