ప్రస్తుత ప్రపంచకప్‌లో దూకుడుగా ఆడలేకపోతున్న టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై పలువురు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా లీగ్‌దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో నిదానంగా ఆడి భారత్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడంటూ మాజీలు, అభిమానులు ధోనీపై మండిపడుతున్నారు.

ఈ క్రమంలో ధోనికి భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అండగా నిలబడ్డాడు. ధోనిని విమర్శించడం దారుణమని.. భారతతో పాటు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోని ఆల్‌టైమ్ గ్రేట్‌ క్రికెటర్లలలో ధోనీ ఒకరని అతను కితాబిచ్చాడు.

అలా విమర్శించేవారు ధోనీ వయసును సైతం గుర్తు పెట్టుకోవాలని.. అతను ప్రస్తుతం 20 ఏళ్ల కుర్రాడు కాదని కపిల్ దేవ్ చురకలు అంటించాడు. టీమిండియాలోని ముఖ్యమైన ఆటగాళ్లలో ధోనీ ఒకరని ఆ సమయంలో అతనిపై అంచనాలు ఉండటం సహజమని... మహీ నుంచి అతిగా ఆశించడమే అభిమానుల నిరాశకు కారణమని కపిల్ అభిప్రాయపడ్డాడు.

ఇదే క్రమంలో భారత జట్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భీకరంగా ఉందని.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని కపిల్ అన్నాడు. కోహ్లీ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని అయితే అతను జట్టుకు ఒక సెంచరీ బాకీ ఉన్నాడని కపిల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు 1983లో ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ ‌‌లో ఇంగ్లాండ్‌పై కపిల్‌సేన ఘన విజయం సాధించింది.