టీం ఇండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించనున్నాడు. తన ఖాతాలో మరో రికార్డు వేసుకోడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తాజాగా మరో రికార్డుకి చేరువలో ఉన్నాడు.

అంతర్జాతీయంగా టెస్ట్‌, వన్డే, టీ 20ల్లో కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. గురువారం ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ మైదానంలో వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ రికార్డు కనుక కోహ్లీ చేధించగలిగితే.. ఈ ఘనత దక్కిన 12వ క్రికెటర్ గా కోహ్లీ తన పేరును లిఖించుకోనున్నారు. భారత్ నుంచి అయితే.. మూడోస్థానంలో చోటు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి స్థానంలో సచిన్ టెండుల్కర్( 34,357) మొదటి స్థానంలో, రాహుల్ ద్రవిడ్(24,208) రెండో స్థానంలో ఉన్నారు. 

అంతర్జాతీయంగా 20వేల పరుగులు సాధించడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు , రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇప్పటివరకు 416 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి తొందర్లోనే ఈ రికార్డును అధిగమించనున్నాడు.