మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ కాకముందే థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను  ఔట్ కాలేదంటూ ఇప్పటికే రోహిత్ శర్మ.. స్క్రీన్ షాట్ తీసి మరీ ఫోటోని షేర్ చేశాడు. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగానే రోహిత్ ని ఔట్ గా ప్రకటించారని అభిమానులు మండిపడుతున్నారు.

ఈ కోపంలో రోహిత్ శర్మ అభిమానులు థర్డ్ అంపైర్ కి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. నెట్టింట విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఒక అభిమాని అయితే ఏకంగా థర్డ్ అంపైర్ వికీ పీడియా పేజీని కూడా మార్చేశాడు.

‘2019లో భారత్, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌కు మైకేల్ ని థర్డ్ అంపైర్ గా నియమించారు. రోహిత్ శర్మ ఔట్ ని ఫీల్డ్ అంపైర్ నాట్ ఔట్ గా  ప్రకటిస్తే దాన్ని తప్పుబడుతూ అత్యుత్సాహం చూపించాడు. రీప్లే దృశ్యాలను పట్టించుకోకుండా.. స్పష్టమైన ఆధారాలు లేకుండా రోహిత్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అతడు ఉద్దేశపూర్వకంగానే రెండు వరుస ఓటములు చవిచూసిన ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చాలని చూస్తున్నాడు’ అంటూ పేర్కొన్నాడు. ’ఇలా ఎడిట్‌ చేసిన కొద్దిసేపటికే దీన్ని తొలగించారు.