వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే టీం ఇండియా రెండు మ్యాచ్ ల్లో విజయాన్ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతోంది. తర్వాతి మ్యాచ్ లకు సన్నద్ధమౌతోంది. ఇలాంటి సమయంలో టీం ఇండియాకి ఊహించని షాక్ తగిలింది. టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చేతికి గాయమైంది. దీంతో... ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆయన ఎడమచేతి బొటనవేలుకి స్కానింగ్ చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇటీవల టీం ఇండియా ఆస్ట్రేలియాతో తలపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... శిఖర్ ఎడమచేతికి బాల్ తగిలి గాయమైంది. నొప్పి వల్ల ఆసీస్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ ఫీల్డింగ్‌ చేయలేదు. అతడి స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేశాడు. ఈ క్రమంలో... త్వరలో టీం ఇండియా న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లో శిఖర్ దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కానింగ్ వచ్చిన ఫలితం ఆధారంగా ఈ మ్యాచ్ లో శిఖర్ ఆడుతాడో, లేదో అన్న విషయం తేలనుంది.