టీం ఇండియా ఒక తప్పు చేయకపోయి ఉంటే...  కచ్చితంగా ఇంగ్లాండ్ మీద గెలిచి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం టీం ఇండియా ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో తలపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఈ ప్రపంచకప్ లో తొలిసారి ఓటమి పాలయ్యింది. కాగా... ఈ నేపథ్యంలో ఓటమికిగల కారణాలను అభిమానులు వెతికే పనిలోపడ్డారు.

ఇంగ్లండ్ ఓపెనర్ రాయ్ విషయంలో టీమిండియా చేసిన ఓ పొరపాటు వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. 11వ ఓవర్లో హార్థిక్ పాండ్యా వేసిన నాలుగో బంతిని ఆడిన రాయ్ షాట్‌కు యత్నించబోయి కీపర్ ధోనీకి క్యాచ్‌గా చిక్కాడు. ధోనీ క్యాచ్ పట్టిన అనంతరం ఔట్ అని అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు.
 
అయితే.. బ్యాట్‌ ఎడ్జ్‌ బంతికి తాకినట్లు ఫుటేజ్‌లో స్పష్టమైంది. టీమిండియా రివ్యూ కోరకపోవడంతో రాయ్‌ గండం నుంచి గట్టెక్కినట్టయింది. అదే రివ్యూ కోరి ఉంటే.. 21 పరుగులకే రాయ్ పెవిలియన్‌కు వెళ్లే వాడు. అలాంటిది రాయ్ 66 పరుగులు చేసి బెయిర్‌స్టోతో కలిసి ధీటుగా ఆడి భాగస్వామ్య స్కోర్‌లో తన వంతు పాత్ర పోషించాడు.