టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీ ఖాతాలో ఓ చెత్త రికార్డ్ నమోదైంది. ఇప్పటికే ఈ ప్రపంచకప్ లో ధోనీ ఆట తీరు సరిగా లేదంటూ పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అభిమానులు సైతం కొన్ని  మ్యాచుల్లో ధోనీ ఆట తీరుపై పెదవి విరిచేశారు. కాగా... తాజాగా ధోనీ ఖాతాలోకి ఓ చెత్త రికార్డు వచ్చిచేరింది. అది కూడా వికెట్ కీపింగ్ విషయంలో కావడం గమనార్హం.

ఈ మెగాటోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన ధోని ఏకంగా బైస్‌ రూపంలో 24 పరుగులు ఇచ్చాడు. టోర్నీ మొత్తం బైస్‌ రూపంలో 71 పరుగులే రాగా.. ధోని ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం అతని కీపింగ్‌ లోపాన్ని తెలియజేస్తుంది. ఇక ధోని తర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్‌ కీపర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా..9 ఔట్లతో ధోని 9 స్థానంలో ఉన్నాడు. 

మొన్నటి దాకా వికెట్ కీపింగ్ లో ధోనీని కొట్టేవారు ఎవరూ లేరనే వాళ్లు. బ్యాటింగ్ చేసేది ఎవరైనా... ధోనీ వికెట్ల వెనుక నిల్చున్నాడంటే.. క్రీజు దాటే సాహసం కూడా చేయరు. అలాంటి ధోనీ... ఈ ప్రపంచకప్ లో వికెట్ కీపింగ్ లోనూ వెనకపడటం గమనార్హం.