మాంచెస్టర్: టీమిండియా బ్యాటింగ్ విషయంలో ముగ్గురిపైనే పూర్తిగా ఆధారపడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ల మీద టీమిండియా పూర్తిగా ఆధారపడి ఉందనే మాట వినిపిస్తోంది. అయితే, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు కూడా తమ వంతు పాత్ర పోషిస్తారని టీమిండియా మేనేజ్ మెంట్ అంటోంది. 

రోహిత్ శర్మ ఎనిమిది మ్యాచులు ఆడి ఐదు సెంచరీలు చేసి 647 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఐదు అర్త సెంచరీలు చేసి 442 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. కెఎల్ రాహుల్ ఓ సెంచరీ, రెండు అర్థ సెంచరీలతో 360 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. తీవ్ర విమర్శలకు గురవుతున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 223 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. 

మిగతా బ్యాట్స్ మెన్ సరిగా ఆడడం లేదనే విమర్శపై టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఆ విధంగా చూడకూడదని, రెండు వైపులా చూడాలని, టాప్ ఆర్డర్ పరుగులు చేస్తున్నప్పుడు అది చాలా సానుకూలమైన విషయమని అన్నాడు. ప్రతి ఒక్కరూ బాగానే ఆడుతున్నారని, లోయర్ ఆర్డర్ లో కూడా రాహుల్ పరుగులు చేశాడని ఆయన అన్నాడు. ప్రతి ఒక్కరూ బ్యాట్ తోనూ బంతితోనూ రాణిస్తున్నారని చెప్పాడు.

అఫ్గనిస్తాన్ మ్యాచులో తప్ప అవకాశం వచ్చినప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కూడా తమ సత్తా చాటారని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. హార్డిక్ పాండ్యా తన పాత్ర పోషించాడని, మహీ తన వంతు పాత్రను నిర్వహించాడని, రిషబ్ పంత్ కూడా బాగానే ఆడాడని ఆయన అన్నాడు.