ప్రపంచకప్‌లో టీమిండియా ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది. శ్రీలంకపై విజయం సాధించడంతో అగ్రస్థానంపైకి ఎగబాకిన భారత్... నాలుగో స్థానంలో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియన్సన్‌ దాదాపు 11 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ సెమీస్‌లో మరోసారి తలపడుతున్నారు.

2008లో అండర్-19 ప్రపంచకప్‌ సందర్భంగా భారత జట్టుకు కోహ్లీ... న్యూజిలాండ్‌కు విలియమ్సన్ నాయకత్వం వహించారు. మలేషియా వేదికగా జరిగిన ఆ టోర్నిలో ఈ జట్లు సెమీఫైనల్స్‌లో పోటీపడింది.

ఈ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకొని 205 పరుగులు చేసింది. సీజే ఆండర్సన్ 70, విలియమ్సన్ 37 పరుగులు చేశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 43 ఓవర్లకు 191 పరుగుల లక్ష్యాన్ని సవరించారు.

కోహ్లీ 43, ఎస్‌పీ గోస్వామి 51 రాణించడంతో 41.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఇప్పుడు జాతీయ జట్లకు నాయకత్వం వహిస్తున్న ఈ ఇద్దరు మరోసారి ఢీకొట్టుకుంటుండటంతో ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.