పాకిస్తాన్‌ చేతిలో ఘోర పరాజయంపై స్పందించాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డూప్లెసిస్. ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఐపీఎలే తమ కొంపముంచిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ కొంతమంది ఆటగాళ్లను ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని డూప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.

తీవ్ర పనిభారంతో కొందరు ఆటగాళ్లు ఈ మెగాటోర్నీలో రాణించేలేకపోతున్నారని.. ముఖ్యంగా రబాడ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. ‘‘ తమ జట్టు ఓటమిపై సరైన సమాధానం చెప్పలేకపోతున్నామన్నాడు..

విశ్రాంతి లేకుండా ఆడితే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని పేర్కొన్నాడు. ఇతర పేసర్ల గాయాలు కూడా రబాడపై ప్రభావం చూపాయని.. అతనొక్కడే భారాన్ని మోయడంతో ఇది అతని బౌలింగ్‌పై ప్రభావం చూపిందని డూప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.

టోర్నీ ఆరంభంలో రాణించకుంటే.. మనకు మనపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది.. రబాడ విషయంలో కూడా అదే జరిగిందన్నాడు.  అతను ఏదో ఒకటి చేయాలని చూశాడని.. కానీ ఏం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో సఫారి జట్టు ప్రపంచకప్‌ ప్రస్థానం లీగ్ దశలోనే ముగిసినట్లయ్యింది.