అంబటి రాయుడును మరోసారి దురదృష్టం వెంటాడింది. గాయం కారణంగా విజయ్ శంకర్ తప్పుకోవడంతో.. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ధావన్, విజయ్ శంకర్ ఇద్దరు గాయం కారణంగా వైదొలిగిన రెండు సందర్భాల్లోనూ రాయుడు ప్రస్తావన వచ్చినప్పటికీ బోర్డు అతనిపై కరుణ చూపలేదు.

దీనికి కారణం లేకపోలేదు.. ప్రపంచకప్‌ జట్టులో తాను ఖచ్చితంగా చోటు దక్కించుకుంటానని రాయుడు ధీమాతో ఉన్నాడు. అయితే అనూహ్యంగా అతని స్థానంలో విజయ్ శంకర్ ఎంపిక కావడంతో అంబటి అసహనం వ్యక్తం చేశాడు.

శంకర్ ఎందుకు తీసుకున్నామో చెబుతూ.. త్రీ డైమన్షనల్ ఆటగాడు అంటూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యానించారు. దీంతో రాయుడు దానిపై సెటైర్ వేస్తూ.. ‘‘వరల్డ్‌కప్ చూసేందుకు 3డి అద్దాలు కొన్నాను’’ అంటూ ట్వీట్ చేయడం వివాదం రేపింది.

ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపికకాకపోవడం వల్ల బాధలో అలా అన్నాడని రాయుడును అప్పుడు చూసిచూడనట్లు వదిలేసినా.... ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దలు అంతగా తేలిగ్గా మరిచిపోయినట్లు లేరని తాజా ఘటనతో అర్థమవుతోంది.

తమ నిర్ణయాన్నే ప్రశ్నించిన రాయుడుకు మళ్లీ జట్టులో ఛాన్స్ ఇవ్వకూడదని వారు బలంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఇక ఇదే సమయంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ ట్రాక్ రికార్డ్ చూస్తే. అతను ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు.

దేశవాళీ లిస్ట్ ఎ వన్డేల్లో 75 మ్యాచ్‌లలో 48.71 సగటుతో 3,605 పరుగులు చేశాడు. గతేడాది భారత్  ఎ తరపున ఇంగ్లాండ్ గడ్డపై 4 వన్డేల్లో 71.75 సగటుతో, 105.90 స్ట్రైక్ రేట్‌తో చేసిన 287 పరుగులతో పాటు ఐపీఎల్‌లో అదరగొట్టడం మయాంక్ ఎంపికకు ప్రధాన కారణం. ఇతడిని ప్రధానంగా ఓపెనింగ్ స్థానానికే ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది.