వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ మరోసారి నిరాశపరిచాడు. తన కెరిర్ లో ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో... తన బ్యాటింగ్ కి పనిచెబుతాడని అభిమానులంతా ఆశగా ఎదురుచూశారు. కానీ... అతి తక్కువ స్కోర్ కే గేల్ పెవీలియన్ కి చేరాడు.

ప్రపంచకప్ లో భాగంగా గురువారం వెస్టిండీస్... ఆప్ఘనిస్తాన్ తో తలపడుతోంది. కాగా... ఈ మ్యాచ్ లో గేల్ కేవలం 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో ఔట్ అయ్యాడు. జాద్రాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి కీపర్ ఇక్రమ్ అలీ చేతికి చిక్కాడు. మైదానంలో అడుగుపెట్టినప్పటి నుంచి గేల్ ఉద్వేగంగా కనిపించాడు. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు ఈ జమైకా బిగ్ మ్యాన్‌కు షేక్ హ్యాండ్స్ ఇస్తూ వాతావరణాన్ని ఉద్వేగంగా మార్చేశారు. 

ఆ తర్వాత విండీస్ ఫ్యాన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఔటై పెవిలియన్ చేరుతున్నప్పుడు మరోసారి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్యాట్‌తో గేల్ అభివాదం చేశాడు. గేల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు 7పరుగులకే వెనుదిరగడంతో నిరాశపడ్డారు.