మాంచెస్టర్ వేదికగా జరగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో వర్షం న్యూజిలాండ్ కన్నా కూడా టీం ఇండియాకే ఎక్కువ కలిసొచ్చే అవకాశం ఉందని ఇంగ్లాండ్  మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ లో భాగంగా సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటితోనే మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉండగా... వర్షం అడ్డుపడింది. దీంతో.. రిజర్వ్ డే గా నేటికి మ్యాచ్ ని వాయిదా వేశారు.

దీంతో... ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందా అని సర్వత్రా అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. వర్షం ఎవరికి సపోర్ట్ గా నిలవనుందా అనే ఆసక్తి మొదలైంది. దీంతో.. దీనిపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ స్పందించారు.

‘‘ఈ వర్షం టీంఇండియాకే కలిసివస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పటికే వాళ్లు ఫీల్డింగ్ ముగిసింది. అంతేకాకుండా వారు చేరుకోవాల్సిన లక్ష్యం కూడా వాళ్లకి ముందే తెలుసు కదా’’ అని  ఆయన అన్నారు. 250లోపు లక్ష్యం కాబట్టి టీం ఇండియా సునాయాసంగా చేధించగలదని చెప్పారు. వికెట్లను కాపాడుకుంటూ ఆడగలిగితే ఇండియాదే విజయమని అన్నారు. అయితే... ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా వాతావరణం మీదే ఆధారపడి ఉందని అన్నారు. మ్యాచ్ ముందు న్యూజిలాండ్ బౌలర్స్ కి వీలుగా ఉండే అవకాశం ఉందని.. అయితే టార్గెట్ ఎక్కువగా లేకపోవడంతో గెలుపు టీం ఇండియాకి కష్టమేమీ కాదని చెప్పారు.