ముంబై: అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తున్న అంబటి రాయుడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) చిన్నచూపు చూసిందనే విమర్శలు వస్తున్నాయి. ఆయనకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యం ఇవ్వలేదు సరి కదా, ఆయనను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే తలబిరుసుతో వ్య.వహరించినట్లు కనిపిస్తోంది.

బిసిసిఐ తీరుపైనే అంబటి రాయుడు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపిస్తున్నారు. అంబటి రాయుడు అంత తీసివేయదగ్గ ఆటగాడేమీ కాడు. అతని సగటు 47 పైచిలుకు ఉంది. ఏ క్రికెటర్ కైనా అది మంచి సగటే. జాతీయ జట్టులో నెంబర్ 4 సమస్య పరిష్కారమైందని ఒకానొక సందర్భంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంబటి రాయుడిని ఉద్దేశించి అన్నాడు. 

ప్రపంచ కప్ పోటీలకు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం కల్పించకపోవడంతో కలత చెందిన అంబటి రాయుడు తీవ్రమైన వ్యాఖ్యలే చేసి ఉండవచ్చు గాక. కానీ, అంబటి రాయుడి మానసిక స్థితిని అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా బిసిసిఐ పెద్దలు వ్యవహరించాల్సి ఉండింది. 

చివరకు ప్రపంచ కప్ స్టాండ్ బై ప్లేయర్ గా అంబటి రాయుడిని ఎంపిక చేసినప్పటికీ చివరకు మొండిచేయే చూపారు. విజయ శంకర్ స్థానంలో అంబటి రాయుడికి స్థానం దక్కాల్సి ఉండింది. విజయ శంకర్ గాయపడి జట్టు నుంచి తప్పుకున్న తర్వాత రాయుడిని కాకుండా ఓపెనర్ గా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. 

మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసి జట్టులోకి పంపుతున్న సమయంలో అంబటి రాయుడితో బిసిసిఐ పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉండిందా, లేదా అనేది ప్రశ్న. తాము ఏ పరిస్థితిలో మయాంక్ అగర్వాల్ ను పంపిస్తున్నామో అంబటి రాయుడికి వివరించి, తగిన ఆత్మవిశ్వాసాన్ని అతనికి అందించాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉందనేది కాదనలేని సత్యం. 

అంబటి రాయుడు చాలా ఆలస్యంగానే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. ప్రస్తుతం అతని వయస్సు దాదాపు 33 ఏళ్లు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనే తపన అంబటి రాయుడి లాంటి ఆటగాడికి ఉండడంలో తప్పు లేదు. తదుపరి ప్రపంచ కప్ లో ఆడే అవకాశం వయసు రీత్యా అతనికి లభించే అవకాశం కూడా లేదు. ఈ కారణంగానే అంబటి రాయుడు తీవ్రంగా కలత చెంది క్రికెట్ క్రీడకు ఫుస్టాప్ పెట్టినట్లు భావించాల్సి ఉంటుంది.