ప్రపంచ కప్ కు ఎంపికైన భారత జట్టులో స్థానం దక్కకకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంబటి రాయుడు బుధవారంనాడు తన రిటైర్మమెంట్ విషయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ప్రపంచ కప్ భారత సెలెక్టర్లు తనను ఎంపిక చేయకపోవడంపై అంబటి రాయుడు అప్పట్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. తాను 3డీ కళ్లజోడు పెట్టుకుని చూస్తానని వ్యాఖ్యానించారు. తనను కాకుండా విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

విజయ శంకర్ త్రీ డైమన్షన్ ప్లేయర్ అని, అందుకు జట్టులోకి తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పడంపై అంబటి రాయుడు అలా మాట్లాడాడు. రిషబ్ పంత్ కూడా తనను ఎంపిక చేయకపోవడంపై కాస్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇద్దరిని ప్రపంచ కప్ జట్టుకు రిడర్డ్వ్ ప్లేయర్లుగా ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో ప్రపంచ కప్ కు దూరం కావడంతో రిషబ్ పంత్ చేరాడు. 

ఆ తర్వాత విజయ శంకర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో తనకు అవకాశం వస్తుందని అంబటి రాయుడు భావించాడు. అయితే, బిసిసిఐ మరో విధంగా ఆలోచించింది. అంబటి రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్ ను విజయ శంకర్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. దీంతో అంబటి రాయుడు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యాడు. ఈ కారణంగానే ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడని భావిస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 6 వేల పైచిలుకు పరుగులు చేశాడు. మొత్తం 55 వన్డే మ్యాచులు ఆడి 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

అంబటి రాయుడు 216 ట్వంటీ20 మ్యాచులు ఆడాడు. ఓ సెంచరీ, 24 అర్థ సెంచరీలు చేశాడు. టీ20ల్లో అతను 4626 పరుగులు చేశాడు. టీమిండియా నాలుగో స్థానంలో సరైన ఆటగాడు దొరకని సమయంలో అంబటి రాయుడు ఆ స్థానంలోకి ఎంపికయ్యాడు. ఆ స్థానంలో నిలకడైన ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు కూడా. రాయుడి ఆట చూసిన తర్వాత ఆ స్థానానికి ఢోకా లేదని కూడా అనిపించుకున్నాడు.