ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు సంప్రదాయాన్ని కొనసాగించింది. తన చిరకాల ప్రత్యర్థిపై భారత్ విజయ ఢంకా మోగించేసింది. మాంచెస్టర్‌ ఓల్డ్ ట్రాఫర్డ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 89 పరుగులతో గెలుపొందింది. ఇలా పాక్ ని ఓడించడం భారత్ కి ఇదేమి తొలిసారి కాదు. పాక్‌పై వరుసగా భారత్.. ఏడో సారి విజయం సాధించింది. ఇప్పటి వరకు భారత్ ఏయే టోర్నీలలో పాక్ పై విజయం సాధించిందో..  ఒక్కసారి చరిత్రలోకి వెళితే...

1992 లో గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్ లు తొలిసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 19 ఏళ్ల వయస్సులో వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ లాంటి బౌలర్లను ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్ లో 62 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 216/7 పరుగులు చేయగా, కాగా పాకిస్థాన్ 173 పరుగులకు ఆలౌటైంది. 

1996లో బెంగుళూరు వేదికగా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ పాక్ తలపడగా, ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 287/8 పరుగులు చేసింది. నవజ్యోత్ సింగ్ సిద్ధు 93 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

1999 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ లో జరగగా సూపర్ సిక్స్ దశలో భారత్, పాకిస్థాన్ లు ముచ్చటగా మూడోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ 227/6 పరుగులు చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం 180 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో వెంకటేష్ ప్రసాద్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

2003లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ దశలో భారత్ పాక్ లు తలపడగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఛేజింగ్ కు దిగిన భారత్ తరపున ఓపెనింగ్ కు దిగిన సచిన్ టెండూల్కర్ 75 బంతుల్లో 98 పరుగులు చేసి ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. 

2011 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్ లు వరుసగా ఐదోసారి తలపడ్డాయి. సెమీ ఫైనల్ దశలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ 85 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ లక్ష్యఛేదనలో 231 పరుగులకు ఆలౌటైంది.

2015లో ప్రపంచ కప్ గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్ లు తలపడగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 300/7 పరుగులు చేసింది. పాకిస్థాన్ లక్ష్యఛేదనలో తడబడి 224 పరుగులకు ఆలౌటైంది. కోహ్లీ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.