లండన్: అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలు లేవు. బంగ్లాదేశ్ పై శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ లో తాము పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. తన చివరి లీగ్ మ్యాచులో పాకిస్తాన్ లార్డ్స్ మైదానంలో బంగ్లాదేశ్ ను ఎదుర్కోబోతున్నది. 

పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుకోవడమనేది పూర్తిగా లెక్కలపైనే ఆధారపడి ఉంది. పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 350 పరుగులు చేసి బంగ్లాదేశ్ ను 311 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. 400 పరుగులు చేస్తే 316 పరుగుల తేడాతో, 450 పరుగులు చేస్తే 321 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తే పరుగులతో ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. 

చివరి లీగ్ మ్యాచ్ లో తాము పూర్తి స్థాయిలో సత్తా చాటుతామని, తాము శాయశక్తులా పోరాటం చేస్తామని, అల్లా కరుణిస్తే అద్భుతం జరగవచ్చునని సర్ఫరాజ్ అన్నాడు. 600, 500, 400 పరుగులు చేస్తే ప్రత్యర్థిని 50 పరుగులకు ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. 316 పరుగుల తేడాతో గెలిచే అవకాశం ఉంటుందని, వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే తాము ప్రయత్నం చేస్తామని అన్నాడు. 

వాస్తవంగా చెప్పాలంటే తాము మ్యాచ్ ను గెలవాల్సి ఉందని అన్నాడు. పాకిస్తాన్ ఇంగ్లాండుపై 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. అఫ్గనిస్తాన్ పై ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఇదే పాకిస్తాన్ చేసిన అత్యధిక స్కోరు. 

టోర్నమెంటులో వాడిన పిచ్ లను చూస్తే భారీ స్కోరు చేయడం సాధ్యం కాదని సర్ఫరాజ్ అన్నాడు. 280 - 300 పరుగులు చేయడానికి మాత్రమే పిచ్ లు సహకరిస్తున్నాయని అన్నాడు. పిచ్ లు పరుగులు చేయడానికి అనుకూలంగా లేవని అన్నాడు. స్పిన్ బౌలింగ్ ను ఆడాల్సి వచ్చినప్పుడు బంతి బ్యాట్ మీదికి రావడం లేదని అన్నాడు. 

ఇంగ్లాండు న్యూజిలాండ్ ను ఓడించడంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఆస్ట్రేలియా, ఇండియా ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.