ప్రపంచ కప్ హోరులో పాక్ మరోసారి పరాజయం మూటకట్టుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో భారత్-పాక్ మధ్య జరిగిన ఏ మ్యాచ్ లోనూ పాక్ గెలిచింది లేదు. దీంతో...  ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పాక్ తాపత్రయపడింది. కానీ... చివరకు విజయం భారత్ నే వరించింది. దీనికి తోడు ఈ మ్యాచ్ జరగుతున్న సమయంలో వర్షం కూడా పడింది. ఆ వర్షంతో స్టేడియం నీటితో తడిచిపోయింది. అయితే... అది వర్షపు నీరు కాదని...పాక్ అభిమానుల కన్నీరంటూ ఓ అభిమాని అభివర్ణించడం విశేషం.

పాక్ జట్టు ఓటమి పాలవడంతో కన్నీరు పెట్టుకున్న ఆ దేశ అభిమాని నిక్ ‘‘ఇది పాకిస్థాన్ ప్రజలు పెడుతున్న కన్నీళ్లు...ఇది వర్షపునీరు అని పొరపాటు పడకండి’’ అంటూ తాను రోదిస్తున్న ఫోటోతోపాటు ట్వీట్ చేశారు. ‘‘పాక్ అభిమానిగా నాకు తెలుసు...ఈ మ్యాచ్ చూడటం చాలా కష్టమని, కాని ప్రస్థుతం భారత జట్టు చాలా గొప్పది’’ అంటూ ఓ క్రీడా విలేఖరి ట్వీట్టర్ లో అంగీకరించారు. 

భారతదేశంతో జరిగిన క్రికెట్ మ్యాచ్ పాకిస్థాన్ ను మరోసారి నిరాశపరచింది అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసినపుడు ‘‘ఈ వర్షం మా ఆశలను కడిగి వేసింది’’ అంటూ మరో క్రీడా పాత్రికేయుడు రెహనాల్ హక్ వ్యాఖ్యానించారు. కోహ్లీ వన్డే సెంచరీలు 41 చేయగా, మొత్తం పాక్ జట్టు సభ్యులందరూ కలిసి 41 సెంచరీలు చేశారు...ఇది భారత, పాక్ జట్టు సామర్ధ్యంలో వ్యత్యాసానికి ఓ ఉదాహరణ అంటూ మరో అభిమాని వ్యాఖ్యానించారు.