వన్డే ఇంటర్నేషనల్ లో రోహిత్ శర్మ బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే అంటున్నారు టీం ఇండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ. బుధవారం రాత్రి ఇంగ్లాండ్ వేదికగా టీం ఇండియా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. వరల్డ్ కప్ లో  టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్‌ మ్యాన్‌' రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సందర్భంగా రోహిత్ ఆటతీరుపై మ్యాచ్ విజయానంతరం కోహ్లీ స్పందించాడు. 'ప్రపంచకప్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం. అయితే ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ ఎదురైంది. ఇది జట్టు సమిష్టి విజయం. మ్యాచ్‌ ఎలా సాగిందో, పిచ్‌ ఎలా స్పందించిందో చూస్తే.. ఈ మ్యాచ్ ఎలాంటి సవాలో అర్థమవుతుంది. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌కు హ్యాట్సాఫ్‌. అతడి ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం' అని కోహ్లీ తెలిపాడు.

‘‘ ఇంత  ఒత్తిడిలో కూడా జట్టు విజయానికి రోహిత్ కృషి చేశాడు. అందుకే ఈ ఇన్నింగ్స్ రోహిత్ కెరీర్ లోనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక బ్యాట్స్ మెన్ గా నాకు తెలుసు. కొన్నిసార్లు బాల్స్ బౌన్స్ అవుతూ ఉంటాయి అయినా కూడా ప్రశాతంగా ఆడటం అంటే అది అంత సాధ్యమైన పనేమీ కాదు ’’ అని కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. 

‘‘రోహిత్ చాలా కంపోజ్డ్ గా గేమ్ ఆడాడు. చాలా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.