టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత్ తోపాటు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని బ్యాటింగ్ స్టైల్ ని అందరూ ఇష్డపడుతుంటారు. వేరే దేశపు జట్టు సభ్యుల్లో కూడా కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్  ఒకరు. మొన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున రషీద్ తన ఆటతో ఆకట్టుకున్నాడు.

ఈ సంగతి పక్కన పెడితే.. ఐపీఎల్ సమయంలో విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రషీద్ ఖాన్ ఒక బ్యాట్ ని గిఫ్ట్ గా అందుకున్నాడు. అయితే.. ఆ బ్యాట్ ని తమ ఆఫ్ఘాన్ జట్టు ఆటగాడు ఒకరు తన వద్ద నుంచి కొట్టేశాడని రషీద్ చెబుతున్నాడు.

ప్రస్తుతం వరల్డ్ కప్ పోరు మొదలైంది. దీనిలో భాగంగా ఆప్ఘనిస్థాన్ ఈ రోజు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సందర్భంగా రషీద్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ఎలా పొగొట్టుకున్నాడన్న విషయాన్ని వివరించాడు. 

‘‘నాకు మొదటి నుంచి బ్యాట్స్ సేకరించడం అలవాటు. విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ లాంటి క్రికెటర్ల దగ్గర నుంచి స్పెషల్ బ్యాట్స్ ని నేను గిఫ్ట్ గా పొందాను. ఈ బ్యాట్స్ తోనే నేను వరల్డ్ కప్ ఆడాలి అనుకుంటున్నాను. ఈ బ్యాట్స్ నాకు ఎక్కువ పరుగులు తీయడానికి ఉపయోగపడతాయి అని భావిస్తున్నాను’’ అని చెప్పాడు.

‘‘ఇటీవల ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ఉపయోగించాను. ఆ బ్యాట్ తో నేను ఎక్కువ పరుగులు చేయగలిగాను. నేను ఫోర్ కోసం ప్రయత్నిస్తే... అది సిక్స్ వెళ్లింది. తర్వాత మ్యాచ్ అనంతరం నేను పెవిలియన్ కి వెళ్లాక మా టీం కెప్టెన్ అప్ఘర్ ఆఫ్గాన్ నా బ్యాట్ తనకివ్వమని అడిగాడు. నేను ఇవ్వను అని చెప్పాను. అయినా సరే అతను కోహ్లీ నాకు ఇచ్చిన స్పెషల్ బ్యాట్ ని తీసుకున్నాడు. ఆ బ్యాట్ చాలా స్పెషల్ వ్యక్తి నుంచి తనకు వచ్చిన గిఫ్ట్అని.. కాబట్టి తిరిగి ఆ బ్యాట్ తనకే వచ్చి  చేరుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పాడు.