టీం ఇండియా క్రికెటర్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వరల్డ్ కప్ ఆడటానికి పంపితే... ఎంజాయ్ చేస్తున్నారా అనా ఫైర్ అవుతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... ఇప్పటికే వరల్డ్ కప్ పోరు ప్రారంభమైంది. ఈ టూర్ కోసం టీంఇండియా ఇంగ్లాండ్ కూడా వెళ్లింది. అయితే...  టీం ఇండియా తలపడటానికి ఇంకా కొద్దిగా సమయం ఉంది

దీంతో... టీం ఇండియా విశ్రాంతి తీసుకుంటోంది. గత మూడు రోజులుగా షాపింగ్‌లతో బిజిగా కనిపించిన టీమిండియా సభ్యులంతా శుక్రవారం అడవి బాట పట్టారు. పచ్చటి చెట్ల మధ్య పెయింట్‌బాల్‌ ఆడుతూ హుషారు ప్రదర్శించారు. ఈ పిక్‌నిక్‌కు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. వాటికి క్యాప్షన్‌గా..‘   అడువుల్లో సరదాగా గడిపిన టీమిండియా చిత్రాలు.. మరిన్ని ఫొటోల కోసం చూస్తూనే ఉండండి’ అని పేర్కొంది.

ఈ ట్వీట్‌ చూసిన అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా టీమిండియా ఆటగాళ్లు, బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీని టీమిండియా లైట్‌ తీసుకుంటుందని, ప్రాక్టీస్‌ సెషన్‌ లేకుండా పిక్‌నిక్‌లంటూ కాలం వృథా చేయడం ఏంటని మండిపడుతున్నారు. 

‘మిమ్మల్ని పంపించింది క్రికెట్‌ ఆడటానికి.. పిక్‌నిక్‌లంటూ ఎంజాయ్‌ చేయడానికి కాదు’ అంటూ ఓనెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘ఫన్‌ ఫన్‌ అంటే ప్రపంచకప్‌ చేజారిపోతుంది జాగ్రత్త’ అంటూ మరొకరు హెచ్చరించారు. ‘ముందు ప్రాక్టీస్‌ చేయండన్నా.. ఫన్‌ తర్వాత’ అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.