ఇండియన్ క్రికెట్ అభిమానులపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్స్ కి ఓపిక తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. విజయం సాధించకపోతే.. అభిమాన క్రికెటర్ల దిష్టిబొమ్మలను తగలపెడతారని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో కోహ్లిసేన బాగా రాణించాలంటే భారత అభిమానులు ఓపికలతో ఉండాలని సూచించాడు. 

ప్రస్తుతం ప్రపంచకప్ హోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సలామ్ క్రికెట్ కార్యక్రమంలో పాల్గొన్న రిచర్డ్స్ ఇండియన్ అభిమానుల గురించి మాట్లాడాడు. ‘భారత అభిమానులకు కొన్నిసార్లు ఓపిక ఉండదు. దిష్టిబొమ్మలను తగలబెట్టడం తెలివితక్కువ పని. ఏ ఆటగాడికైనా ఓడిపోవాలని ఉండదు. గెలవడానికే ప్రయత్నిస్తారు. ఈ రోజు హీరో కాకపోయినంత మాత్రానా రేపు జీరో కాదు. ప్రత ఒక్కరి పట్ల గౌరవంగా, మర్యాదకంగా నడుచుకోవాలి. అన్నిసార్లు మనకే మంచి జరగాలంటే కుదురదు’ అని రిచర్డ్స్‌ చెప్పుకొచ్చాడు.

సౌరవ్‌ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగానే భారత అభిమానులు ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రిచర్డ్స్ పైవిధంగా స్పందించాడు.