వన్డే వరల్డ్ కప్ హోరు రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం బంగ్లాదేశ్,దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ కళ్లు చెదిరే క్యాచ్ లతో అదరగట్టాడు. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌(42; 30 బంతుల్లో 9 ఫోర్లు) ధాటిగా ఆడే క్రమంలో డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా క్రిస్‌ మోరిస్‌ వేసిన 12 ఓవర్‌ నాల్గో బంతిని సౌమ్య సర్కార్‌ పుల్‌ చేయబోయాడు. 

కానీ సర్కార్ అంచనా తప్పింది. ఆ సమయంలో వికెట్లకు దూరంగా ఉన్న కీపర్‌ డీకాక్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని అందుకోవడానికి పరుగెత్తూకుంటూ వచ్చి బంతి కింది పడే సమయంలో అమాంతం డైవ్‌ కొట్టాడు.

ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో సౌమ్య సర్కార్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. క్రీజ్‌లో కుదురుకుని నిలకడగా ఆడుతున్న సమయంలో సర్కార్‌ ఔట్‌ కావడం బంగ్లా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. అదే సమయంలో డీకాక్‌పై కామెంటేటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. డీకాక్ బాల్ క్యాచ్ పట్టిన వీడియో.. ఇప్పుడు వైరల్ గా మారింది.