ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. త్వరలో టీం ఇండియా కూడా రంగంలోకి దిగనుంది. కాగా.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరదీశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని తన మాటలతో రబాడ రెచ్చగొడుతున్నాడు.  కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినప్పటికీ అతడికి పరిపక్వత లేదని ఎద్దేవ చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా కోహ్లితో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని వివరిస్తూ కోహ్లిని చులకన చేసి మాట్లాడాడు.

‘ఐపీఎల్‌లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. నా బౌలింగ్‌లో అతడు ఫోర్‌ కొట్టడంతో నేను ఆలోచనలో పడ్డాను. అప్పుడు కోహ్లి నన్ను ఓ మాట అనడంతో అదే మాటను కోహ్లిని అన్నాను. దీంతో వెంటనే అతడు కోపంతో రగిలిపోయాడు. అతను అద్బుతమైన బ్యాట్స్‌మన్‌ అయినంత మాత్రాన అతడు అన్న మాటలు పడాలా?. అతడు తిడితే నేను పడను. కోహ్లి ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలి’అంటూ రబాడ వ్యాఖ్యానించాడు. 

మరి దీనిపై కోహ్లీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కామెంట్స్... మున్ముందు ఎలాంటి వివాదానికి దారితీస్తాయో చూడాల్సి ఉంది.