తనను తక్కువగా అంచనా వేస్తే ఎంతటి బలమైన జట్టుకైనా చుక్కలు చూపిస్తామని మరోసారి రుజువు చేసింది బంగ్లాదేశ్. ప్రపంచకప్‌లో భాగంగా బలమైన దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 330 పరుగులు చేయడం ద్వారా బంగ్లాదేశ్ అనేక రికార్డులు బద్ధలు కొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాధించిన పరుగులే ఇప్పటి వరకు వన్డేల్లో బంగ్లాకు అత్యుత్తమ స్కోర్ .

ఈ క్రమంలో గతంలో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక పరుగుల రికార్డును తిరగరాసింది. ఇక ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ బంగ్లాకు ఇదే అత్యుత్తమ స్కోర్. 2015 ప్రపంచకప్ సందర్భంగా స్కాట్లాండ్‌పై 322 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో షకీబుల్-రహీమ్‌లు మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ద్వారా ఇది ప్రపంచకప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నమోదైంది.

ఇది ఓవరాల్ వరల్డ్‌కప్‌లో బంగ్లాకు అత్యధిక పరుగుల భాగస్వామ్యంగా నమోదైంది. అంతముందు కూడా మహ్మదుల్లా, రహీమ్‌లు గత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డును షకీబ్, రహీమ్‌లు సవరించారు.