టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కి క్షమాపణలు చెప్పారు. భారత అభిమానుల తరపున కోహ్లీ ఈ క్షమాపణలు  చెప్పడం గమనార్హం. ఆదివారం ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆసిస్ మాజీ కెప్టెన్ ని భారత అభిమానులు కించపరిచారు. దీంతో... వారి తరపున కోహ్లీ క్షమాపణలు చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.

స్మిత్ గతంలో బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  ఇండియన్ అభిమానులు...  స్మిత్ ని ఉద్దేశించి చీటర్, చీటర్ అంటూ కామెంట్స్ చేశారు. దీనిని గమనించిన కోహ్లీ వెంటనే... అభిమానులను అలా చేయవద్దంటూ మందలించాడు.స్మిత్‌ కోసం చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సైగ చేస్తూ.. తన క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. 

మ్యాచ్‌ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. భారత ప్రేక్షకుల తరఫున తానే స్వయంగా స్టీవ్‌ స్మిత్‌కు క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు.  ‘జరిగిందేదో జరిగిపోయింది. అతను పునరాగమనం చేశాడు. వారి దేశం కోసం పోరాడుతున్నాడు. ఐపీఎల్‌లో సైతం స్మిత్‌ను ఇలా గేలి చేయడం చూశా. ఒకరిని కించపరస్తూ ఇలా గేలిచేయడం మంచిది కాదు. మా అభిమానుల తరఫున మైదానంలోనే అతన్ని క్షమాపణలు కోరాను. ఇది ఏమాత్రం అంగీకరించేది కాదు. గతంలో మా మధ్య వివాదాలు ఉండవచ్చు. మైదానంలో ఇద్దరం వాదించుకోవచ్చు. కానీ అతని బాధ నుంచి వచ్చే ఆటను చూడాలనుకోవద్దు. ఇక్కడ చాలా మంది భారత అభిమానులు ఉన్నారు. వారంతా ఓ చెత్త ఉదాహరణగా మిగిలిపోవద్దు. నేను స్మిత్‌ స్థానంలో ఉంటేనైతే చాలా బాధపడేవాడిని ఎందుకంటే.. అతను తప్పు చేశాడు. ఆ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దానికి శిక్షను కూడా అనుభవించాడు. అయినా మళ్లీ గేలి చేస్తే సహించడం ఎవరికైనా కష్టమే’ అని కోహ్లి అభిప్రాయపడ్డాడు.