హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ చెరువు వద్ద కలకలం రేగింది. ఆదివారం ఓ యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. వివరాల్లోకి వెళితే.. లోటస్‌ పాండ్‌ చెరువులో సుమారు 30 ఏళ్ల యువకుడి మృతదేహం బోర్లాపడి తేలియాడుతూ కనిపించింది.

ఉదయం లోటస్‌పాండ్‌ పార్కు తెరిచిన వాచ్‌మెన్‌.. లోపలి ప్రాంతాన్ని పరిశీలించి బయటకు వచ్చేసరికి చెరువులో మృతదేహం కనిపించింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు దీనిని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని బంజారాహిల్స్‌ ఐఏఎస్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ అహ్మద్‌ ఉద్దీన్‌ అలియాస్‌ అల్తాఫ్‌గా పోలీసులు గుర్తించారు.

ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను.. లోటస్‌పాండ్‌ చెరువులో విగతజీవిగా పడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్తాఫ్‌కు షుగర్‌ వ్యాధి తప్ప ఎలాంటి ఇతర ఇబ్బందులు లేవని అతడి సోదరుడు వాపోయాడు.

పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ప్రముఖులు నివసించే ప్రదేశం కావడం, అక్కడికి దగ్గరలోనే వైసీపీ కార్యాలయం, ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసం వుండటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.