హైదరాబాద్: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించాడని యువతి నడిరోడ్డుపైనే ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రియుడి ఎదుటే యువతి ఈ దారుణానికి పాల్పడింది.  

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సింకింద్రాబాద్ ప్రాంతంలోని సీతాఫల్ మండిలో నివాసముంటున్న పాండుకు నలుగురు కూతుర్లు. అతడి రెండో కూతురు పూజిత(19) ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రదీప్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే వుంటోంది. 

read more  మద్యం తాగి విసిగిస్తున్నాడని.. తండ్రిని చంపిన కొడుకు

అయితే గతకొద్దిరోజులు ప్రియుడు ప్రదీప్ ను పెళ్లిచేసుకోవాలని యువతి కోరుతోంది. అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. దీంతో ఈ విషయంపై మాట్లాడేందుకే ప్రదీప్ ను సీతాఫల్ మండీ ప్లైఓవర్ పైకి రావాలని పూజిత పిలిచింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో పూజిత ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి ప్లైఓవర్ పై నుండి కిందకు దూకింది. 

తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. పూజిత మృతికి కారణమైన ప్రదీప్‌పై కేసు నమోదు చేశారు.