మద్యం తాగి విసిగిస్తున్నాడన్న కారణంగా ఓ కొడుకు.. కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు. తల్లి సహాయంతో తండ్రిని హత్య చేసి.. శవాన్ని పొలంలోనే పాతిపెట్టారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల  పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  గుండాల గ్రామానికి చెందిన  సాలె కృష్ణయ్య(45) లలిత దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా... వీరికి రమేష్(20) అనే కొడుకు కూడా ఉన్నాడు. కాగా.. రమేష్ చేవెళ్లలోని ఓ ఆస్పత్రి వద్ద వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. కుమార్తెను చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు.

కాగా.. కృష్ణయ్య రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో.. తండ్రి విసిగించడాన్ని తట్టుకోలేకపోయిన రమేష్.. గొంతు పిసికి చంపేశాడు. అనంతరం తల్లితో కలిసి.. పొలంలో శవాన్ని పాతిపెట్టాడు. కొన్ని రోజులుగా కృష్ణయ్య కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అల్లుడు గట్టిగా నిలదీయడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూతురు, అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.