హైదరాబాద్: యశోదా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సుభాష్ అనుమానాస్పద మృతి మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడానికి ఇష్టపడకపోవడంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో  ఈ సంఘటన జరిగింది. 

నిత్య అనే యువతిని అతను ప్రేమించి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. తన తల్లిదండ్రులకు చెప్పి వస్తానని ఆమె కేరళకు వెళ్లింది. నెలలు గడుస్తున్నాతిరిగి రాలేదు. తన తల్లిదండ్రులు ప్రేమ పెళ్లిని అంగీకరించడం లేదని, వారు అంగీకరిస్తే తిరిగి వస్తానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: ప్రేమ వివాహం, విడివిడిగా దంపతులు: డాక్టర్ అనుమానాస్పద మృతి

దాంతో అతను మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి తన గదిలో నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన అతను గది నుంచి బయటకు రాలేదు. దాంతో తల్లి మల్లమ్మ లేపడానికి ప్రయత్నించింది. అయితే అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్ాడు. 

దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సుభాష్ మత్తు ఇంజక్షన్ తీసుకుని మరణించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ అసలు కారణం తెలియదంటున్నారు. మృతుడి తండ్రి ఆగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

మృతుడిది మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలోని ఠాగూర్ నగర్ వాసి. సింగరేణిలో పదవీ విరమణ చేసిన సుభాష్ తండ్రి ఆగయ్య ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదు వచ్చారు. అతనికి నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కూతుళ్లు కాగా, ఇద్దరు కుమారులు, నలుగురిలోకి చిన్నవాడు సుభాష్. 32 ఏళ్ల సుభాష్ ఇటీవల చదువు ముగించుకుని యశోదా ఆస్పత్రిలో కార్జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు.