హైదరాబాద్: యశోదా ఆస్పత్రి వైద్యుడు ఒకతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హైదరాబాదులోని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్ గాయత్రి నగర్ లో సుభాష్ అనే 32 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన యశోదా ఆస్పత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

డాక్టర్ సుభాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని తంగూర్ గ్రామం. ఆయన 2017లో నేరేడ్ మెట్ కు చెందిన డాక్టర్ లాస్యను ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్లుగా స్థానికంగా ఉన్న గాయత్రి నగర్ లోని పద్మావతి అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నారు. 

కుటుంబ కలహాల వల్ల కొంత కాలంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సుభాష్ జ్వరంగా ఉందని గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

అపార్టుమెంట్ లో సుభాష్ మరణించిన పడి ఉన్న విషయం శుక్రవారంనాడు పోలీసులకు తెలిసింది. దాంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని వివరాలు చెప్పడానికి బంధువులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.