హైదరాబాద్ లో మహిళలు, యువతుల వరుస అదృశ్యం కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటివరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు, కూకట్‌పల్లిలో పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారని పోలీసులు తెలుపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరం పరిధిలో మరో మూడు అదృశ్య కేసులు నమోదు అయ్యాయి. 

ఖాజిపురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ బిన్‌ మహమూద్‌ కూతురు సబినా బిన్‌ మహమూద్‌ (22) ఈ నెల 28న మందుల దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. వెతికినా దొరకకపోవడంతో ఆమె సోదరుడు అబుబాకర్‌ బిన్‌ మహ్మద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ రోజు రోజు సాయంత్రం 7.30 గంటలకు ఆమె తనకు ఫోన్‌ చేసి క్షేమంగా ఉన్నాను.. నా కోసం వెతకవద్దని తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌ 040–27854793, 9490616488, 8985465178 నంబర్లకు తెలపాలని పోలీసులు సూచించారు.

ఇక రెండో కేసులో రెండు నెలల కూతురుతో కలిసి ఛత్రినాక లో ఓ గృహిణి అదృశ్యమయింది. ఎస్‌ఐ అరవింద్‌ గౌడ్‌ తెలిపిన వివరాలు.. ఉప్పుగూడ అంబికానగర్‌కు చెందిన పండరి కుమార్తె శృతి (20) సదాశివపేటలోని అత్తగారింటి నుంచి అమ్మగారింటికి ప్రసవం కోసం వచ్చింది. ప్రస్తుతం ఆమెకు రెండు నెలల చిన్నారి ఉంది. 

నెల రోజుల క్రితం శృతి ఉదయం పాపతో కలిసి ఇంటి నుంచి వెళ్లి రాత్రి వచ్చింది. ఎక్కడికి వెళ్లావని తల్లి అడిగినా సమాధానం ఇవ్వలేదు. ఈ నెల 24న మరోసారి ఇంటి నుంచి పాపతో పాటు వెళ్లిన శృతి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక స్టేషన్‌లో గాని సెల్‌ 9490616500 నంబర్‌లో గాని తెలపాలని కోరారు.

ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భర్త మృతిచెందడంతో డిప్రెషన్‌కు గురైన ఓ మహిళ కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బోరబండ వినాయక్‌రావునగర్‌లో ఉండే వి.సునీత భర్త ఆనంద్‌ ఆరు నెలల క్రితం చనిపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సునీత ఈ నెల 27వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 

ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వివిధ చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో కుమార్తె సోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచుకీ తెలిసినవారు పోలీస్‌ స్టేషన్‌లో లేదా 9515874814 ఫోన్‌ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.