హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ పై తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పోలీస్ అధికారిగా కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలా క్యారెక్టర్ లేకుండా వ్యవహరిస్తున్న ఆయనపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. 

సిపి అంజనీ కుమార్ ను ఉత్తమ్ వ్యక్తిగత దూషణలకు దిగారు. పోలీస్ శాఖలోనే అత్యంత గలీజ్ అలవాట్లున్న వ్యక్తి ఎవరైనా వున్నారంటే ఆయన అంజనీకుమారేనని అన్నారు.  విలువలకు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వని వ్యక్తి... పూర్తిగా దిగజారిన వ్యక్తిత్వం గలవాడు అంజనీ కుమార్ అంటూ మండిపడ్డారు. 

read more  జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

ఇక పోలీస్ ఉన్నతాధికారిగా తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ తీవ్రమైన అవినీతి పనులకు పాల్పడ్డాడని... అత్యంత అవినీతిపరుడైన పోలీస్ అంటూ ఆరోపించారు. అసలు ఆయనకు పోలీస్ కమీషనర్ గా వుండే అర్హతలే లేవని...సెక్షన్‌- 8 ప్రకారం గవర్నర్‌కు ఆయనపై చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు.  అందుకే అంజనీ కుమార్ వ్యవహాలను, అక్రమాలను గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళతామని ఉత్తమ్  తెలిపారు.  

శాంతియుతంగా తమ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో దీక్ష చేపడితే అడ్డుకుని అరెస్ట్ చేసే అధికారాలు సిపికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేవలం అధికార పార్టీ నాయకులు, సీఎం కేసీఆర్  మెప్పు  పొందడానికి ఆయన ఇలా చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారం గురించి ఉత్తమ్ డిజిపి మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేసి అక్రమ అరెస్టులను ఆపాలని  ఆదేశాలివ్వమని సూచించారు. 

read more  నా భార్యకు కూడా టికెట్ ఇవ్వను, కానీ చైర్ పర్సన్...: జగ్గారెడ్డి

 పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చి పోలీసులు తమను ఎలా అరెస్ట్ చేస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులను ఉపయోగించి తమ ధీక్షను భగ్నం చేయించిందని... ఇలా నియంతలా వ్యవహరించి ప్రజల గొంతును నొక్కేసినట్లే ఇప్పుడు నాయకుల గొంతును నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఉత్తమ్ ఆరోపించారు.