సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల్లో తన భార్యకు కూడా తాను టికెట్ ఇవ్వబోనని తెలంగాణ కాంగ్రెసు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చెప్పారు. కౌన్సిలర్ టికెట్ల విషయంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల ఇంచార్జీ, ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలు కలిసి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ వాళ్లు చేసే ఖర్చు  కన్నా ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. 

తన భార్యకు తాను టికెట్ ఇవ్వబోనని, ఆమెకు టికెట్ ఇవ్వాలా... వద్దా అనే విషయాన్ని స్థానిక నాయకులే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. కష్టపడి ఐక్యంగా పనిచేసి పోటీ చేసిన వారంతా గెలువాలని ఆయన అన్నారు. 

"మీరు గెలువకుంటే ఎమ్మెల్యేగా నాకు గౌరవం ఉండదు. ఎవరికైనా టికెట్ దక్కకపోతే కో ఆప్షన్ మెంబర్ గా అవకాశం ఇస్తాం" అని ఆయన అన్నారు. తన వద్ద డబ్బులు లేవని, తాను ఎవరికీ ఇవ్వబోనని, డబ్బుల టెన్షన్ తనకు పెట్టవద్దని ఆయన అన్నారు. 

నామినేషన్ల తర్ావత అభ్యర్థులందరితో సమావేశమవుతానని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తన అప్పులు, మీ అప్పులు చెల్లిస్తానని, ఎవరూ టెన్షన్ పడవద్దని ఆయన అన్నారు. 

సంగారెడ్డి మున్సిపాలిటీ రాజకీయంగా ప్రాధాన్యం గల ప్రాంతమని, నిర్మలను చైర్ పర్సన్ గా గెలిపిస్తే పెద్ద పేరు వస్తుందని ఆయన చెప్పారు. ఓడిపోతే భవిష్యత్తు ఉండదని, ప్రతిదీ లోతుగా ఆలోచించి పనిచేస్తానని ఆయన చెప్పారు.