సికింద్రాబాద్ లో పార్క్ చేసిన కార్లలో కేజీల కొద్ది బంగారంతో పాటు కట్టల కొద్ది నగదు బయటపడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ప్రాంతంలో భారీగా నగదు, బంగారం అక్రమంగా తరలిస్తున్నారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు సమాచారం అందింది.

దీంతో సిబ్బందితో కలిసి ఆదివారం ఈస్ట్‌మారేడ్ పల్లి షెనాయ్ నర్సింగ్ హోం సమీపంలోని ఓ నివాస సముదాయంలో పార్క్ చేసిన ఆకుపచ్చ రంగు కారులోని సంచిలో నాలుగు కిలోల బరువున్న 40 బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1,57,52,000 ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి ఇదే ప్రాంతంలోని మరో కారులో చేసిన తనిఖీల్లో రూ. 1.99 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి సంపాదించిన సొమ్ముగా వివరించారు.

పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు గాను నిందితులు ఈ సొమ్మును ఎంతో చాకచక్యంగా కారులోని హ్యాండ్ బ్రేక్ ఉండే చోట దాచారు. అక్కడ ఓ అర లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నోట్ల కట్టలు పేర్చారని తెలిపారు.

ఈ బంగారాన్ని కేరళ నుంచి మైసూరు మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేసినట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. నిందితులుగా భావిస్తోన్న ముగ్గురిని అరెస్ట్ చేసి కస్టమ్స్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

Also Read:

విధుల్లోంచి సస్పెండ్: మనస్తాపంతో ఈవో ఆత్మహత్య

ఆర్‌కామ్ దివాళా: అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ