హైదరాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతూ భారీగా సంపాదించిన ఓ ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి భార్య వద్ద కిలో బంగారం ఉంది. పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. రైళ్లలో స్వీట్లు అమ్ముతూ పెద్ద యెత్తున చోరీలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో అతను సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. 

అతను ఇప్పటి వరకు 400కు పైగా రైళ్లలో దోపిడీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులకు చిక్కిన అతని పేరు తానేందర్ సింగ్ కుశ్వా అలియాస్ రాజు. 40 ఏళ్ల వయస్సు గల అతను చందానగర్ లోని మై హోం జువెల్ అపార్టుమెంటులో నెలకు రూ.40 వేలు అద్దె చెల్లిస్తూ నివాసం ఉంటున్నాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లలను ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు. కొడుకు ఎల్కేజీ చదువుతుండగా, కూతురు ఒకటో తరగతి చదువుతోంది. బేగంపేట రైల్వే బ్రిడ్జీ సమీపంలో స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, సికింద్రాబాద్ రైల్వే రక్షణ దళం (సీఆర్పీఎఫ్) పోలీసులు అడ్డుకుని ప్రశ్నించారు. 

అతని సమాధానాలతో అనుమానించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, జేబులో ఉన్న కత్తితో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను గాయపరిచి స్కూటీని వదిలేసి పారిపోయాడు.  అప్రమత్తమైన కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ ఆర్పీఎఫ్, జీఆర్ఫీఎఫ్ పోలీసులు అతని స్కూటీ వద్ద మాటు వేశారు. సాయంత్రం తిరిగి వచ్చిన తానేందర్ ను వారు పట్టుకున్నారు.

2004లో తానేందర్ హైదరాబాదు వచ్చాడు. తన మిత్రుడు రాంస్వరూప్ సాయంతో సికింద్రాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో స్వీట్లు, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు అమ్మేవాడు. సంపాదన సరిపోకపోవడంతో ప్రయాణికులను దోచుకోవడం ప్రారంభించాడు.

అతనిపై మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. 2006లో వికారాబదులో పరిచయమైన చంద్రకాంత్ అనే వ్యక్తి వద్ద చోరీల్లో శిక్షణ పొందాడు. రైళ్లలో జేబులు కత్తిరించడం ద్వారా, బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఇళ్లు, స్థలాలు, షాపులు కొన్నాడు. ఈ క్రమంలోనే మూడు సార్లు అరెస్టయ్యాడు. 

విడుదలైన తర్వాత తిరిగి చోరీలు చేయడం సాగించాడు. మంగళవారంనాడు అతన్ని అరెస్టు చేసిన పోలీసులు 668,09 గ్రాముల బంగారు ఆభరణాలను, రూ.13.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో కోటీ రూపాయలు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు.