వరద బాధితులకు సాయం అందడంలేదంటూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేతలతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 

జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు వరద బాధితులతో కలిసి రేవంత్‌ నిరసనకు దిగారు దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు, వరద బాధితులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందటం లేదని... కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సాయం అందిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. నిజమైన బాధితులకు ఎవరికీ ఇవ్వట్లేదు.. పట్టించుకోవట్లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఇదిలా ఉంటే వరద బాధిత కుటుంబాలకు ఇస్తున్న రూ.10 వేలు తాత్కాలిక, తక్షణ సహాయం మాత్రమేనని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 

అవసరమైతే సాయాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, పరిసరాల్లో 3-4 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా పాడైన వారికి అదనపు పరిహారం అందిస్తామని తెలిపారు.