హైదరాబాద్: దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  సాధారణంగా నవంబర్ రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ చలికాలం ప్రారంభం అవుతూ ఉంటుందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ చలికాలంలో పగలు తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు.

దీనిపై హైదరాబాద్ వాతావరణ శాఖ డైరక్టర్ కే నాగరత్న మాట్లాడుతూ.. ‘‘ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి తగ్గిపోయాయి. చలికాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. రానున్న నెలలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి’’ అని వెల్లడించారు. కాగా ఆదివారం నగరంలో అత్యల్ఫ ఉష్ణోగ్రత 16.9, అత్యధిక ఉష్ణోగ్రత 29.4సెల్సియస్‌లుగా నమోదు అయ్యాయి.

అయితే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. సాధారణంగా వర్షాలు ఎక్కువ పడిన సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల ప్రజలకు చలితో తిప్పలు తప్పవని వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చలికాలం ప్రారంభం కావడంతోనే ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు బంద్ అవ్వగా.. స్వెటర్ సెంటర్లకు డిమాండ్ మొదలైంది.